తమిళంతో పాటు, తెలుగులోనూ చిత్రాలు చేసి అలరించిన నటి అమలాపాల్. కేవలం సినిమాలే కాదు, వెబ్‌సిరీస్‌ల్లోనూ ఆమె నటిస్తున్నారు. తాజాగా, తెలుగు చిత్ర పరిశ్రమపై ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమలాపాల్ మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమను సినీ కుటుంబాలు, అభిమానులే శాసిస్తున్నారని అభిప్రాయపడింది. దీనికి తోడు రొమాంటిక్ సన్నివేశాలు, పాటలు తప్ప ఇక్కడ హీరోయిన్స్‌కు పెద్దగా స్థానం లేదని చెప్పుకొచ్చింది.
తాను ఎక్కువ తెలుగు సినిమాలు చేయకపోవడంపై ఆమెను ప్రశ్నించగా, అమలాపాల్ స్పందిస్తూ.. ‘‘నేను తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని గమనించా. అక్కడ ఫ్యామిలీ కాన్సెప్ట్ నడుస్తోంది. ఆ ఇండస్ట్రీలో సినీ కుటుంబాలు, వారి వారసులు, అభిమానులదే పైచేయి. ఇక సినిమాలు తెరకెక్కించే తీరు కూడా విభిన్నంగా ఉంటుంది. ఒక హీరో సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఇద్దరితోనూ లవ్ సీన్స్, పాటలు ఉంటాయి. ప్రతిదీ గ్లామరస్‌గా చూపిస్తారు. అక్కడ తెరకెక్కేవన్నీ కమర్షియల్ చిత్రాలే. అందుకే ఆ ఇండస్ట్రీకి నేను కనెక్ట్ కాలేకపోయా. చాలా తక్కువ సినిమాలు చేయడానికి బహుశా అదీ ఓ కారణమేమో’’ అని అమలాపాల్ చెప్పుకొచ్చింది.
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ లోనూ అమలాపాల్‌కు అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. మొదటిసారి ఆడిషన్ అయిన తర్వాత ఆమెను పక్కన పెట్టారు. అయితే, మళ్లీ ఆడిషన్/టెస్ట్ లుక్‌కు పిలవగా, ‘నా మానసిక స్థితి సరిగా లేదు. ఏమీ అనుకోవద్దు’ అని నిర్మొహమాటంగా ఆఫర్‌ను వద్దని చెప్పింది అమలాపాల్. ఇటీవల ఆమె నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘కడవర్’ డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.