బిఆర్ఎస్ జాతీయ పార్టీ అని కేసిఆర్ కలలు కంటున్నారని సెటైర్లు వేశారు బిజెపి ఎంపీ లక్ష్మణ్. పేరు మార్పు తీర్మానం ద్వారా టిఆర్ఎస్ పార్టీ గుర్తింపు కోల్పోయిందని అన్నారు. ఇప్పుడు బిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కాదు.. జాతీయ పార్టీ కాదని ఎద్దేవా చేశారు. మునుగోడులో బిఆర్ఎస్ పేరుతో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి బీఆర్ఎస్ పేరుతో గెలవాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ ఆంధ్ర ప్రజలను అసభ్య పదజాలంతో అవహేళన చేశారని.. వారి ఆహారపు అలవాట్లను కించపరిచారని అన్నారు. ఓట్ల కోసం చిచ్చు పెట్టి పంబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ నుంచి వెళ్ళిపోతే ఇంటికో కొలువు వస్తుందని ప్రచారం చేశారని.. అవకాశవాద రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు లక్ష్మణ్. మునుగోడు ఉపఎన్నిక తరువాత బిఆర్ఎస్ సంగతి ఏంటో తెలుస్తోందన్నారు.