హైదరాబాద్ నగరం అంటే ఒకప్పుడు పాతబస్తీ….ఇక్కడ రాజకీయంగా ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కువనే సంగతి తెలిసిందే…అయితే ఇక్కడ ప్రజలు ఎంఐఎం పార్టీని తప్ప మరొక పార్టీని ఆదరించే పరిస్తితి ఉండదు. గత కొన్ని ఎన్నికల నుంచి పాతబస్తీలో ఎంఐఎం సత్తా చాటుతూనే వస్తుంది. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గెలిచే సీన్ లేదు. కాకపోతే గతంలో పాతబస్తీలో కాంగ్రెస్ పార్టీకి కాస్త బలం ఉండేది. కానీ ఇప్పుడు ఆ బలం తగ్గిపోయింది. ఇక ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి బలం లేదు.
పైగా ఎన్నికల్లో ఎంఐఎం గెలిచే సీట్లలో టీఆర్ఎస్ పార్టీ నామమాత్రంగానే పోటీ చేస్తుంది. ప్రస్తుతానికి ఎంఐఎం పార్టీకి 7 సీట్లలో బలం ఉంది. ఛార్మినార్, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, యాకుత్‌పురా, బహదూర్‌పురా, కార్వాన్, మలక్‌పేట్ సీట్లు ఎంఐఎం చేతుల్లోనే ఉన్నాయి. ఈ ఏడు సీట్లలో ఎంఐఎంకు చెక్ పెట్టడం కష్టం. అయితే పాతబస్తీలో ఉన్న గోషామహల్ సీటు బీజేపీ చేతుల్లో ఉంది.
ఇక 7 సీట్లలోనే సత్తా చాటుతున్న ఎంఐఎం…ఈ సారి తన బలాన్ని పెంచుకోవాలని చూస్తుంది. వచ్చే ఎన్నికల్లో మరో రెండు సీట్లని కూడా కైవసం చేసుకోవాలనే లక్ష్యంగా పనిచేస్తుంది. ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కువ ఉన్న రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ స్థానాలపై కూడా ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లోనే రాజేంద్రనగర్ సీటు తమకు వదిలేయాలని టీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు.
కానీ అక్కడ మళ్ళీ టీఆర్ఎస్ గెలిచింది. గత ఎన్నికల్లో రాజేంద్రనగర్‌లో ఎంఐఎం పార్టీకి 46 వేల ఓట్లు వరకు పడ్డాయి. ఇక టీఆర్ఎస్ కోసం గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పోటీ చేయలేదు. కానీ ఈ సారి మాత్రం ఈ సీటు వదిలే ప్రసక్తి లేదని ఎంఐఎం అంటుంది. ఈ సారి రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ సీట్లని కైవసం చేసుకునే దిశగా ఎంఐఎం పనిచేయనుంది.