హైదరాబాద్ నగరానికి మరో భారీ కంపెనీ వచ్చింది. ప్రసిద్ధ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కు చెందిన వెబ్ సర్వీసెస్ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ కేంద్రం హైదరాబాద్ లో మంగళవారం ప్రారంభమైంది. దీని ద్వారా వచ్చే ఎనిమిదేళ్లలో రూ. 36,300 కోట్ల పెట్టుబడులతో, ఏటా సగటున 48 వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తామని సంస్థ పేర్కొంది.
ఈ కేంద్రం పరిధిలో గల ఆసియా పసిఫిక్ దేశాల్లోని మూడు అవైలబిలిటీ జోన్లకు సేవలు అందిస్తామని తెలిపింది. భారత్ లో మొదటి అమెజాన్ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ కేంద్రం ముంబైలో 2016లో ప్రారంభమైంది. హైదరాబాద్ కేంద్రం రెండోది. డేటా సెంటర్ల ద్వారా భాగస్వామ్య సంస్థలు, అంకురాలు, వినియోగదారులకు భద్రతతో కూడిన సురక్షిత, వేగవంతమైన సేవలను ఈ కేంద్రం అందిస్తుందని అమెజాన్ డేటా, మౌలిక వసతుల సేవా విభాగం ఉపాధ్యక్షుడు ప్రసాద్ కళ్యాణరామన్ తెలిపారు.