తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలనే లక్ష్యంతో బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. అలాగే రాష్ట్ర బీజేపీ నేతలకు…కేంద్ర పెద్దలు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. స్వయంగా వారే రంగంలోకి దిగి పదునైన వ్యూహాలు పన్నుతూ కేసీఆర్‌కు చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే అమిత్ షా…తెలంగాణ రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇటీవల ఆయన, తెలంగాణ బీజేపీ నేతలతో చర్చించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎలా బలపడాలనే అంశంపై దిశానిర్దేశం చేశారు.
ఇక నాయకులని ముందు పెట్టి షా..బ్యాగ్రౌండ్‌లో వర్క్ చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఆపరేషన్ 70 పేరుతో పనిచేస్తున్నారు. 70 సీట్లు తెచ్చుకుని అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అయితే 70 సీట్లు రావాలంటే ఎస్సీ, ఎస్టీ సీట్లలో కూడా బీజేపీ పట్టు సాధించాలి. సాధారణంగా ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో బీజేపీకి పెద్ద పట్టు ఉండదు. అందుకే ఆ స్థానాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ చేసింది. 19 ఎస్సీ స్థానాలు, 12 ఎస్టీ స్థానాలపై ఫోకస్ చేసింది. కనీసం వీటిల్లో సగం సీట్లు గెలుచుకున్న బీజేపీకి తిరుగుండదు.
ఇటీవల ఈ స్థానాల్లోనే నాయకులతో బండి సంజయ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే త్వరలోనే బలమైన ఇంచార్జ్‌లని నియమించడానికి సిద్ధమవుతున్నారు. ఇలా బండి పనిచేస్తుంటే…తెర వెనుక షా పనిచేస్తున్నారు. కేంద్రం నుంచి ఓ బృందాన్ని పంపి..ఈ స్థానాలపై ఫోకస్ పెట్టనున్నారు. ఈ స్థానాల్లో టీఆర్ఎస్ బలమెంత, కాంగ్రెస్, బీఎస్పీ, కమ్యూనిస్టుల బలం ఎలా ఉంది..బీజేపీ పుంజుకోవాలంటే ఏం చేయాలనే అంశంపై సర్వేలు నిర్వహించి, పూర్తి వివరాలు తెలుసుకొనున్నారు.
కేంద్రం నుంచే వచ్చే బృందం…దాదాపు నెల రోజుల పాటు రిజర్వడ్ స్థానాల్లో తిరిగి నివేదికలు తయారుచేసి షాకు ఇవ్వనున్నారు. ఆ నివేదికలు బట్టి షా, రాష్ట్ర నేతలకు గైడెన్స్ ఇవ్వనున్నారు…దాని ద్వారా టీఆర్ఎస్‌కు చెక్ పెట్టడానికి చూస్తున్నారు.