ఏపీ ఆడ పడుచులకు జగన్ గుడ్ న్యూస్..

-

ఆధునిక కాలంలో ఉన్నామని చెప్పుకుంటున్నా.. చంద్రయాన్ 2 ప్రయోగాలు చేస్తున్నా ఇంకా పల్లెల్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి. గుక్కెడు స్వచ్ఛమైన తాగు నీరు దొరక్క అల్లాడే ప్రాంతాలెన్నో.. ఇలాంటి పల్లెల్లో ఇంటి ఆడపడుచులకు నీళ్లు తెచ్చుకోవడమే ఓ పెద్ద పనిగా మారుతోంది. దగ్గర్లోకి చేతి పంపో.. వీధి చివరన ఉన్న బావో.. కిలో మీటరు దూరంలో ఉన్న వాగో.. ఇలా వాళ్లు ఇళ్లు కదలందే తాగునీరు దొరకని గ్రామాలెన్నో.

 

ఇక ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే ఆ ఆడపడుచులకు నీటి కష్టాలు తీరబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఇంటికీ తాగునీటి కుళాయిని అందించే లక్ష్యంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అవసరమైన కార్యాచరణ ప్రణాళిక

రూపకల్పనకు పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ ప్రాజెక్టు కోసం 46 వేల 675 కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ బృహత్తర ప్రాజెక్టును రెండు దశల్లో అమలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ మంచినీటి కుళాయిని అందించేందుకు ఉద్దేశించిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు అమలుపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చించింది. 2022 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. కనీసం 30 ఏళ్ల పాటు వినియోగించుకునేలా వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ డిజైన్ ఉండాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 46,982 గ్రామీణ ప్రాంతాలకు, 99 పట్టణప్రాంతాల్లో తాగునీటి సరఫరా కోసం ప్రాజెక్టును అమలు చేస్తారు.

ఈ ప్రాజెక్టు కోసం మొదటి దశలో 37,475 కోట్లు, రెండో దశలో 9,200 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా 2500 కోట్ల రుణం తీసుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version