మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ ఏపీలో చిచ్చు రాజేస్తున్నాయి. మంత్రి పదవులు వచ్చినా వారు బాగానే ఉన్నా… మంత్రి పదవులు రాని వారు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ముఖ్యంగా సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మళ్లీ మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారు. బాలినేనిని బుజ్జగించేందుకు ప్రభుత్వ సలహాదారుడు సజ్జలతో పాటు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విజయవాడలో ఆయన ఇంటికి కూడా వెళ్లారు. అయినా కూడా బాలినేని అలక వీడలేదు.
తాజాగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకాశం జిల్లాలోని తన అనుచరులు, ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో బాలినేనితో ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ రెడ్డి భేటీ అయ్యారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని… కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. బాలినేనికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన అనుచరులు, నేతలు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇంకొల్లు జడ్పీటీసీ సభ్యురాలు భవనం శ్రీలక్ష్మీతో పాటు ఓఎంసీ గంగాడ సుజాత, కాన్సిలర్లు కూడా రాజీనామా చేస్తామని ప్రకటించారు.