ఏపీ కూడా తమిళనాడుగా మారుతుందా? త్వరలోనే ఇక్కడి నాయకులు కూడా తమిళనాడు మాదిరిగా అక్కడ అవలంభిస్తున్న రాజకీయాలనే అవలంభిస్తారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. దీనికి ప్రధాన కారణం.. ప్రజలకు ప్రభుత్వాల నుంచి వివిధ రూపాల్లో అందుతున్న నిధులే! ఒకింత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ప్రజలకు నిజంగానే నిధులు ఈ రేంజ్‌లో అందాలా ? అనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో ప్రజలకు ఏటా వివిధ రూపాల్లో ప్రజలకు నిధులు అందుతున్నాయి. అమ్మ ఒడి, రైతు భరోసా, వాహన మిత్ర, నేతన్న నేస్తం, వైఎస్సార్ ఆసరా.. ఇలా అనేక పథకాలు నిధుల పందేరానికి సంబంధించినవే.
వాస్తవానికి గతంలో తమిళనాడులోనూ డీఎంకే అధినేత కరుణానిధి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వంటి వారు గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్రజలకు ఉచితాలు పోటీ పడి ప్రకటించేవారు. ఇంటింటికీ కలర్ టీవీలు, గ్రైండర్లు, ఇంటింటికీ కానుకలు, ఉంగరాలు, పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్లు.. ఇలా అనేక రూపాల్లో అన్నీ ఉచితాలనే ప్రకటించేవారు. దీంతో రాష్ట్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. “అన్ని ఉచితం అని ప్రకటించి అధికారంలోకి వస్తారు. నిధుల కోసం మాపై పడిపోతారు“ అంటూ.. గతంలో పీవీ నరసింహారావు.. ప్రధానిగా ఉన్న సమయంలో తమిళనాడును ఉద్దేశించి బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఏపీలోనూ వస్తుందని అంటున్నారు.
సీఎం జగన్ ఇస్తున్న పథకాలు.. అన్నీ కూడా ఉచితాలతో ముడిపడినవే. ఆయన ఇస్తున్న పథకాలు ప్రతి కుటుంబానికీ అందుతున్నాయి. దీంతో ఒకే ఇంట్లో ఏడాదికి వేల కొద్దీ నిదులు ఉచితంగా అందుతున్నాయని, ఇదే కొనసాగితే.. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రం అంటకాగిపోతుందని జాతీయ మీడియా తాజాగా హెచ్చరించింది. అదేసమయంలో వచ్చే ఎన్నికల నాటికి.. ఈ నిధుల జాబితా సహా ఉచితాలు మరింతగా పెరిగిపోతాయని, రాష్ట్ర బడ్జెట్‌ను మించిపోయిన విధంగా ఈ ఉచితాలు జోరందుకుంటాయని అంటున్నారు.
మరి ఇలా ప్రజలను ఉచితాలకు అలవాటు చేసింది ఎవరు? పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు ఎన్నికలకు ముందు చేసిన జిమ్మిక్కు ఫలించిందా ? వంటి అనేక ప్రశ్నలు తెరమీదికి వస్తున్నా.. దేనికీ ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. కానీ, ఒక్కటి మాత్రం నిజం అంటున్నారు.. విభజన కష్టాలతో అల్లాడుతున్న రాష్ట్రంలో ఇలా ఉచితాలు ఇవ్వడం ఏమేరకు మంచిదని ప్రశ్నిస్తున్నారు.