వైసీపీలో 50 మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్ గల్లంతు అవుతుందని నిన్నటి నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే.. దీనిపై రఘురామకృష్ణ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత వైసీపీ శాసనసభ్యులలో 75 నుంచి 80 మందిని మారుస్తారట అని, అందులో 50 మందికి రానున్న ఎన్నికల్లో అసలు టికెట్ ఇవ్వరని తెలుస్తోందని అన్నారు. 11 మందికి పార్టీ నాయకత్వం అప్పుడే స్థానభ్రంశాన్ని కలిగించిందని, ఆ లాజిక్ ఏమిటో అర్థం కాలేదని పేర్కొన్నారు. ఎందుకంటే చిలకలూరిపేట నియోజకవర్గానికి, గుంటూరు నియోజకవర్గానికి మధ్య పెద్ద దూరం లేదని, చిలకలూరిపేటలో మంత్రి రజిని గారు పనికి రాకపోతే, గుంటూరులో ఎలా పనికి వస్తారు? అని ప్రశ్నించారు.
గుంటూరులో పనికి వచ్చే వ్యక్తి అయితే చిలకలూరిపేటలో కూడా ఆమె పనికి రావచ్చని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. గతంలో ముఖ్యమంత్రి గారి బొమ్మ పెట్టుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచారని చెప్పారని, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి బొమ్మ వీక్ అయిపోయిందని స్పష్టమవుతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేల బొమ్మనే పనిచేయాలని అనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. ముగ్గురు మంత్రులకు స్థానభ్రంశాన్ని కలిగించారు అంటే ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు అధ్వానంగా ఉందని ముఖ్యమంత్రి గారు అంగీకరించినట్లేనని అన్నారు. 11 మందిని నిన్నటికి నిన్న మార్చారంటే, ఇంకా వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పడంలో అర్థం ఉందా? అని ప్రశ్నించారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు మంత్రులు రానున్న ఎన్నికల్లో తమకు టికెట్ వద్దని అంటున్నారని, అయినా వై ఏపీ నీడ్స్ జగన్ అని సోది కబుర్లు చెబుతూ వందల, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాధించింది శూన్యమని రఘురామకృష్ణ రాజు గారు విమర్శించారు.