తమ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12422 మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయంలో సోమవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై మంత్రి విడదల రజిని గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ నాటికి మొత్తం 11208 మెడికల్ క్యాపులు పూర్తిచేసినట్లు చెప్పారు.
పేద ప్రజల ఆరోగ్య భద్రత, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా వైద్య రంగంలో సంస్కరణలు చేపట్టామని, వైద్య సేవలను విస్తరించామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. దానిలో భాగంగానే ఆధునిక వసతులతో కూడిన ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఫ్యామిలీ డాక్టర్ విధానం, జగనన్న ఆరోగ్య సురక్ష పథకం అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. ఆరోగ్య శ్రీ పథకంలో వెయ్యి వరకు ఉన్న సేవలను మూడు వేల వరకు పెంచామని చెప్పారు.