ఛలో అమలాపురం’ తో కేకపెట్టిస్తామంటున్న వీర్రాజు ?

-

వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విషయంలో బీజేపీ ఎక్కడా తగ్గేలా కనిపించడం లేదు. చాలా కాలంగా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేద్దాం అని చూస్తున్నా, సరైన కారణాలు లేకపోవడంతో సైలెంట్ గానే ఉంటూ వచ్చింది. ఇంతలోనే ఏపీ బిజెపి నాయకులకు అంతర్వేది వ్యవహారం బాగా కలిసి వచ్చింది. దీంతో పాటు రెండు మూడు చోట్ల ఇదే రకమైన సంఘటనలు చేసుకోవడం వంటి వాటితో, జగన్ ను ఇరుకున పెట్టేందుకు అవకాశం దక్కింది అని ఆ పార్టీ భావిస్తూ, పదే పదే విమర్శలు చేస్తోంది. తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మండిపడ్డారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతుంటే, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

దాడులు జరిగిన తర్వాత ఆ సంఘటన స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని, ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు తాము గట్టిగానే పోరాడుతామని సోము వీర్రాజు హెచ్చరించారు. దీనిలో భాగంగానే చలో ‘అమలాపురం ‘కార్యక్రమాన్ని శుక్రవారం చేపడతామని అన్నారు. వాస్తవంగా ఛలో అమరాపురం కార్యక్రమాన్ని ముందుగా తాము ప్రకటించలేదని, కానీ ప్రభుత్వం మాత్రం వాలంటీర్ల ద్వారా గ్రామాల్లోని బిజెపి నాయకులు, కార్యకర్తల వివరాలను సేకరించి కవ్వింపు చర్యలకు దిగుతోందని, అందుకోసమే ఛలో అమలాపురం కార్యక్రమాన్ని బిజెపి ఛాలెంజ్ గా తీసుకుని నిర్వహిస్తోందని వీర్రాజు చెప్పుకొచ్చారు.

ఏపీలో వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతున్నా, కేసు నమోదు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.ఈ వ్యవహారాలపైన ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న బిజెపి నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేస్తూ, సెక్షన్ 30 అమల్లో ఉంది అంటూ బెదిరించి ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రతిపక్షాలను వైసీపీ ప్రభుత్వం అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. వెంటనే అంతర్వేది ఘటనలో తమ పార్టీ కార్యకర్తలు నాయకులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలనే డిమాండ్ తోనే తాము ఛలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చామని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు.

ఇక వీర్రాజు వ్యవహారం చూస్తుంటే, ఎవరు ఆందోళనను నిర్వహించినా, ప్రభుత్వం చూస్తూ ఉండాలని, ఎటువంటి చర్యలు తీసుకోకూడదని, ఒకవేళ అక్కడ శాంతిభద్రతలు అదుపు తప్పితే, ఆ నింద కూడా ప్రభుత్వంపై వేసి, రాజకీయ లబ్ధి పొందాలనుకునే విధంగా ఉందంటూ వైసిపి నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే అంతర్వేది వ్యవహారంపై జగన్ సిబిఐ దర్యాప్తుకు ఆదేశించినా, బీజేపీ మాత్రం దొరక్క దొరక్క దొరికిన అవకాశాన్ని చేజార్చుకోకుండా సద్వినియోగం చేసుకుని తమ బలం పెంచుకోవడంపైనే దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది.

-Surya

Read more RELATED
Recommended to you

Exit mobile version