ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ మరోసారి దిల్లీ వెళుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరుల్ని కలిసే అవకాశమున్నట్లు అధికార వర్గాల సమాచారం. చంద్రబాబు ఈ నెల 3వ తేదీన దిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమైన విషయం తెలిసిందే.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి విభజన సమస్యలు పరిష్కరించాలని కోరే అవకాశం ఉంది. ఇతర రాజకీయ అంశాలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండు వారాల వ్యవధిలోనే ఆయన మరోసారి దిల్లీ వెళుతుండటం గమనార్హం. మంగళవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అనంతరం మధ్యాహ్నం 4 గంటలకు ఆయన దిల్లీ బయల్దేరి వెళతారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
మరోవైపు నేడు సీఎం చంద్రబాబుతో జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి సజ్జన్ జిందాల్ సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది.