ఏపీ ఎన్నికల సమయంలో కూటమి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కూటమి ఈ కీలక హామీ అమలుపై కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఏపీఎస్ ఆర్టీసీ అధికారుల బృందం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేసింది. వీటిలో ఏది ఏపీలో అమలుకు వీలవుతుందనే అంశాన్ని పరిశీలించి ప్రాథమికంగా ఓ నివేదికనూ సిద్ధం చేసింది.
ఈ నివేదిక ప్రకారం.. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకానికి తెలంగాణ అనుసరిస్తున్న విధానమే ఏపీకి సరిపోతుందని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అక్కడి మాదిరిగానే రాష్ట్రంలో కూడా పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. అలాగే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా లేదా పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటుందా? రాష్ట్రమంతా ఎక్కడికైనా ప్రయాణానికి అవకాశం ఇస్తారా అనే అంశాలు ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి.