గత చంద్రబాబు ప్రభుత్వానికి, ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించారా? అప్పటికి ఇప్పటికీ.. సీఎంల వ్యవహార శైలిలోను, మంత్రి వర్గ నిర్ణయాల్లోనూ చోటు చేసుకున్న మార్పులను గుర్తించారా? ఇదీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో జరు గుతున్న చర్చ. నిజమే. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి చర్చలు ప్రారంభించిన నాటి నుంచే నేతల నుంచి లీకులు వచ్చేవి. తమకు అనుకూల మీడియాలో వాటిపై ప్రచారం చేసేవారు. ఇక, నిర్ణయం తీసుకున్న తర్వాత పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం చేసుకునేవారు. ఆ తర్వాత కూడా వాటిపై వారం పది రోజుల పాటు మీడియాలో ఊదరగొట్టేవారు. దీంతో ప్రపంచంలో ఎక్కడా చేయని విధంగా చంద్రబాబు ప్రభుత్వం చేస్తోందనే హైప్‌తీసుకువచ్చేందుకు సదరు మీడియా ప్రయత్నించేది.
ఇలా చేసిందే.. రాజధాని అమరావతి వ్యవహారం నుంచి అనేకం ఉన్నాయి. దీనివల్ల చంద్రబాబు ప్రభుత్వంపై `ప్రచార సర్కారు`, `లీకుల ప్రభుత్వం` అనే ముద్ర పడింది. ఇది మంచి జరిగిందో.. చెడు జరిగిందో ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది. ప్రతి విషయా న్ని ముందుగా లీకు చేయడం అనేది చంద్రబాబు ప్రభుత్వం అనుసరించిన ప్రధాన పంథా అనేది ఆ పార్టీ నేతలే అంగీకరించే విషయం. అయితే, దీనికి భిన్నంగా జగన్ సర్కారు ముందుకు సాగుతోంది. తాను చేయాలనుకున్న పనిని చేసేయడం తప్ప.. దీనికి ముందు ఏంటి? తర్వాత ఏంటి? అనే విషయాలను పట్టించుకోవడం లేదు. అంతేకాదు, గత చంద్రబాబు ప్రభుత్వం..` ప్రజల సంతృప్తి` అంటూ.. ప్రతి నెలా ఓ సర్వేను విడుదల చేసేది. ప్రజలు మా ప్రభుత్వానికి ఇన్ని మార్కులు వేశారు. అంటూ.. ప్రచారం చేసుకునేది.
కానీ, జగన్ ప్రభుత్వం ఇలాంటి వాటికి దూరంగా ఉంటోంది. తాను చేయాలను కున్న పనులకు సంబంధించి ఎంత గోప్యత పాటించాలో అంతా పాటిస్తోంది. సదరు కార్యక్రమం ప్రారంభమయ్యే ఒకరోజు ముందు మాత్రమే సంబంధిత మంత్రులు మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. దీంతో మీడియాలోసంచలనంగా మారుతోంది. నిరంతరం ప్రభుత్వంపై కన్నేసి ఉంచుతున్న ప్రత్యర్థి మీడియా కూడా జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో మూడు రాజధానుల ప్రకటన. అసలు అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పేవరకు ఈ విషయం ఎవరికీ తెలియదు.
నిజానికి అప్పటికే అభివృద్ధి వికేంద్రీకరణపై కమిటీని కూడా వేశారు. అయినా ఎవరికీ చెప్పకుండా గోప్యత పాటించారు. ఇక, ఇప్పుడు అమరావతిలో చంద్రబాబు నిర్మించాలనుకున్న అంబేడ్కర్ స్మృతి వనాన్ని విజయవాడకు తరలించే విషయంపైనా అంతే గోప్యత పాటించారు. నిన్నటికి నిన్న సంక్షేమ మంత్రి పినిపే విశ్వరూప్ చెప్పేవరకు ఈ సంచలన నిర్ణయంపై ఎలాంటి లీకులు బయటకు రాలేదు. దీంతో ఇదే విషయంపై టీడీపీ సహా అన్ని రాజకీయ పక్షాల్లోనూ చర్చ సాగుతోంది ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి అంటూ కితాబులిచ్చేవారి సంఖ్య పెరుగుతోంది.