విశాఖ: వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఓ వైపు ఎండలతో ఉక్కపోత పోస్తుంటే మరోవైపు వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతోంది. అక్కడకక్కడ వర్షాలు కూడా కురుస్తున్నాయి. పిడుగులు కూడా పడుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. వాతావరణంలో వస్తున్న మార్పులపై స్పష్టత ఇస్తూ పలు సూచనలు చేసింది.
విదర్భ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. ఇంకా తూర్పు, మధ్య భారతాల్లో మరో రెండు ఆవర్తనాలు వేర్వేరుగా ఏర్పడి ప్రభావం చూపుతున్నాయని వెల్లడించింది. ఈ ప్రభావం కోస్తా, రాయలసీమపై ఎక్కువగా పడుతుందని ప్రకటించింది. దీని వల్ల రాష్ట్రంలో ఎండ తీవ్రంగా మరింతగా ఉంటుందని స్పష్టం చేసింది. సముద్రం నుంచి భూ ఉపరితంపై మేఘాలు ఆవరించాయని, రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మంగళవారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. కర్నూలులో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్టోగ్రత నమోదు అయినట్లు వాతావారణ అధికారులు తెలిపారు.