నాన్చుడు ధోరణి అవలంబిస్తారని.. దేనినీ ఓ పట్టాన తేల్చరని.. పేరు బడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ నాన్చుడు ధోరణి కారణంగానే తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్రంలోని బీజేపీతో అటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నా.. లోపాయికారీగా బీజేపీ కలిసి వస్తే.. పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని నిర్ణయించు కున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు.. కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయకపోయినా.. వ్యవహరిస్తున్నారు. అడిగినా.. అడకపోయినా.. కేంద్రం తీసుకువచ్చిన అనేక బిల్లులకు ఆయన మద్దతు తెలిపారు.
కొన్ని సందర్భాల్లో మోడీని కొనియాడారు కూడా..! అయితే, నిజానికి ఆయా సందర్భాల్లో చంద్రబాబు మద్దతు కేంద్రానికి అవసరం లేకున్నా.. బాబు మాత్రం దూకుడుగానే వ్యవహరించారు. దీంతో కేంద్రంలోని బీజీపీ పెద్దగా బాబును పట్టించుకోలేదు. అయితే, తాజాగా మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును అటు మోడీ, ఇటు పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా భావించాయి. ఈ క్రమంలో తమకు మద్దతిచ్చే పార్టీల కోసం వెతికాయి కూడా. ఈ క్రమంలో చంద్రబాబు తమవైపు మొగ్గుతారని కొందరు నాయకులు ఎదురు చూశారు.
ఎందుకంటే.. రాజ్యసభలో కేంద్రానికి పెద్దగా మెజారిటీ లేనందున వ్యవసాయ బిల్లును ఆమోదించుకునేందుకు బాబు సహకరిస్తారని అనుకున్నారు. కానీ, ఈ విషయంలో బాబు నాన్చుడు ధోరణిని అవలంభించారు. కీలకమైన వ్యవసాయ బిల్లుకు తనకున్న ఒకరిద్దరు రాజ్యసభ ఎంపీలతో మద్దతిచ్చే విషయంలో చంద్రబాబు దూకుడుగా ముందుకు సాగలేక పోయారు.
రాష్ట్రంలో రైతుల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనని అనుకున్న ఆయన మౌనం వహించడంతో అత్యంత కీలక సమయంలో మోడీ దగ్గర మార్కులు మైనస్‌లలోకి వెళ్లాయని ఢిల్లీ వర్గాల కథనం. ఈ సమయంలో కనుక బాబు.. మోడీకి అండగా నిలిచి ఉంటే.. పరిస్థితి వేరేగా ఉండేదని అంటున్నారు.
-Vuyyuru Subhash