ఇటీవల ఎన్టీఆర్ శతజంయత్యుత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ వేడుకలో చేసిన వ్యాఖ్యలపై వైస్సార్సీపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్న విషం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీకాంత్ టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం ఫోన్‌లో మాట్లాడారు.
ఆయనపై కొందరు రాష్ట్ర మంత్రులు, వైస్సార్సీపీ నాయకులు పరుషమైన వ్యాఖ్యలతో తీవ్రమైన విమర్శల దాడి చేయడంపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వాటిని పట్టించుకోవద్దని కోరారు. ‘‘మీరు నాలుగు మంచి మాటలు చెప్పినా వైస్సార్సీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. మీపై వారు మాటల దాడి చేయడం విచారకరం. నేను చాలా బాధపడుతున్నాను…’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
‘‘ఉన్న విషయాలే చెప్పాను. ఎవరెన్ని విమర్శలు చేసినా లెక్కచేయను. నేను చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాను. నా అభిప్రాయం మారదు…’’ అని రజనీకాంత్ పేర్కొన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 28న విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రజనీకాంత్… ఆయనతో తనకున్న అనుభవాల్ని, సినీ రంగంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎన్టీఆర్ నుంచి ఎలా స్ఫూర్తి పొందిందీ వివరించారు. చంద్రబాబును దార్శనికుడిగా కొనియాడారు.