తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొంటామని, సాధారణ ధాన్యానికి చెల్లించిన ధరనే దానికీ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అన్నదాతలు ఆందోళన చెందవద్దని కోరారు. వ్యవసాయాన్ని కాపాడుతూ రైతుల కష్టాల్లో భాగస్వామ్యం పంచుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
అకాల వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో వరికోతలను మరో మూడు నాలుగు రోజులు వాయిదా వేసుకోవాలని కోరారు. భవిష్యత్తులో యాసంగి వరి కోతలు మార్చి నెలలోపే జరిగేలా ఎటువంటి విధానాలను అవలంబించాలో అధ్యయనం చేయాలని వ్యవసాయ శాఖాధికారులను సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో వ్యవసాయశాఖపై సమీక్ష నిర్వహించారు.
‘‘వ్యవసాయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. రైతులకోసం చిత్తశుద్ధితో కార్యాచరణ అమలు చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఊహించని విధంగా వడగళ్ల వానలు అకాలంగా..ఎడతెరిపిలేకుండా కొనసాగుతుండటం బాధాకరం. ప్రకృతి వైపరీత్యానికి ఎవరం ఏమీ చేయలేం. అయినా రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించలేదు. ఎకరానికి రూ.పదివేల సాయంతో వారిని ఆదుకుంటున్నాం. వారి దు:ఖాన్ని, కష్టాన్ని పంచుకోవాలని తడిసిన వరి ధాన్యాన్ని కూడా సేకరించాలని నిర్ణయించింది.” అని కేసీఆర్ అన్నారు.