రుషికొండపై రెండు లక్షల చదరపు అడుగులలో 433 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాన్ని అద్దెకు ఇస్తే, దానికి వడ్డీ కూడా రాదని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. రెండు లక్షల చదరపు అడుగుల స్థలంలో 433 కోట్ల రూపాయలతో నిర్మించిన భవన సముదాయం ఒక్కొక్క చదరపు అడుగుకు 23 వేల రూపాయలు ఖర్చు చేశారని, ప్రభుత్వం ప్రజలను ఎంతగా మోసం చేస్తుందో సాక్షిపత్రిక చెప్పిన లాజిక్ తో అర్థమవుతుందని, తాను చెప్పిన వివరాలను ఖండించగలిగే మొనగాడు ఉంటే ముందుకు రావాలంటూ రఘురామకృష్ణ రాజు సవాల్ చేశారు.
సాక్షి డిబేట్లోనైనా వర్చువల్ గా పాల్గొనడానికి తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. రుషికొండపై గతంలో 60 నుంచి 70 వేల చదరపు అడుగులలో నిర్మాణాలు ఉండగా, జగన్ మోహన్ రెడ్డి గారు ఆ నిర్మాణాలను పడగొట్టి రెండు లక్షల చదరపు అడుగులలో బ్రహ్మాండమైన ప్రణాళికతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించారని, ప్రపంచ పటంలో విశాఖపట్నం పేరు నిలిపేందుకే ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లుగా చెప్పుకొచ్చారని, గతంలో చదరపు అడుగు రెండు వేల రూపాయలతో నిర్మించగా, జగన్ మోహన్ రెడ్డి గారు చదరపు అడుగు నిర్మాణానికి 23 వేల రూపాయలు ఖర్చు చేశారని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రఖ్యాత నిర్మాణ కంపెనీల సారధ్యంలో ఎన్నో సౌకర్యాలతో చదరపు అడుగు 6 వేల రూపాయలకు నిర్మించగా, జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం దానికి అదనంగా నాలుగు వందల శాతం ఖర్చు చేశారన్నారు.