ఏపీ మంత్రికి ఉద్యోగుల షాక్.. జీతాలివ్వలేదని ఛాంబర్​కు లాక్

-

ఏపీలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. వేతన బకాయిలు చెల్లించలేదనే ఆవేదనతో ఏకంగా సచివాలయంలోని మంత్రి ఛాంబర్​కు తాళం వేశారు సిబ్బంది. ఈ రకంగా నిరసన తెలిపి సంచలనం సృష్టించారు. సోమవారం రోజు జరిగిన ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. మంత్రి ఛాంబర్ తెరవని విషయం మీడియా ద్వారా తెలుసుకున్న ఉన్నతాధికారులు జీతాలిప్పిస్తామని సిబ్బందిని పిలిపించి మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత కార్యాలయాన్ని తెరిపించి కథ సుఖాంతం అనిపించారు.

రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ఆయన పేషీలో పని చేస్తున్న పొరుగు సేవల సిబ్బంది షాకిచ్చారు. గతేడాది డిసెంబరు నుంచి జీతాలు చెల్లించకపోవడంతో వారంతా మూకుమ్మడిగా సోమవారం విధులకు గైర్హాజరయ్యారు. దీంతో సచివాలయంలోని మిగతా మంత్రుల పేషీలతో పాటు ఉదయం 10 గంటలకు తెరుచుకోవాల్సిన ఆయన కార్యాలయం తలుపులు మూసేసి కనిపించాయి.ఈ విషయం తెలిసి ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు మంత్రి వేణుగోపాలకృష్ణ, బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. పరువు పోకుండా అందుబాటులో ఉన్న సిబ్బందికి ఫోన్లు చేసి కార్యాలయానికి రప్పించి తలుపులు తెరిపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version