ఏపీ బీజేపీకి పురందేశ్వ‌రి సేవ‌లు స‌మాప్తం…?

-

ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి. కేంద్ర మాజీ మంత్రి, దివంగ‌త ఎన్టీఆర్ కుమార్తెగా ఆమె రాజ‌కీయాల్లో మంచి గుర్తింపు సాధించారు. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్నారు. అయితే, 2014, 2019 ఎన్నిక‌ల్లో వ‌రుస ప‌రాజ‌యాలు చ‌విచూసినా.. త‌న‌దైన శైలిలో రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డంలోను, జ‌గ‌న్‌ను దుయ్య‌బ‌ట్ట‌డంలోనూ ఆమె ముందున్నారు. బీజేపీలో మేధావుల వ‌రుస‌లో ఆమెకు నిన్న మొన్న‌టి వ‌ర‌కు చోటు ల‌భించింది. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఏపీ బీజేపీ సార‌థిగా ఉన్న స‌మ‌యంలో పురందేశ్వ‌రికి మంచి గుర్తింపు ల‌భించింది.

ఎప్ప‌టిక‌ప్పుడు వ‌ర్త‌మాన విష‌యాల‌పై ఆమె స్పందించేవారు. జ‌గ‌న్‌ను సెంట్రిక్‌గా చేసుకుని, రాజ‌ధానికి మ‌ద్ద‌తు ప‌లికారు. అదే స‌మ‌యంలో క‌న్నాకు కూడా మ‌ద్ద‌తిచ్చారు. అయితే ఇప్పుడు ఆమెకు పార్టీలో ప్రాధాన్యం త‌గ్గిపోయింద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ముఖ్యంగా సోము వీర్రాజు పార్టీ అధ్య‌క్షుడిగా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రెండు మాసాల స‌మ‌యంలో పురందేశ్వ‌రి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఆమె మాట కూడా ఎక్క‌డా వినిపించ‌లేదు. దీంతో సాధార‌ణంగానే స‌మ‌యం చూసుకుని స్పందిస్తారులే అని అంద‌రూ అనుకున్నారు.

కానీ, ఇప్పుడు తాజాగా ఏపీ బీజేపీ ప‌ద‌వుల పంప‌కం జ‌రిగిపోయిన త‌ర్వాత‌.. పురందేశ్వ‌రికి రాష్ట్ర క‌మిటీలో చోటు ల‌భించ‌క‌పోవ‌డంతో అస‌లు ఏం జ‌రిగింది ? ఆమెను కావాల‌నే ప‌క్క‌న పెట్టారా ? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఒక‌వేళ జాతీయ పార్టీకి ప్ర‌దాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి ఇచ్చినా.. రాష్ట్రంలోనూ ప‌ద‌వులు ఇవ్వ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా ఉన్న విష‌యం. కంభంపాటి హ‌రిబాబు అధ్య‌క్షుడిగా ఉన్న‌స‌య‌మంలో కేంద్రంలో చ‌క్రం తిప్పిన చాలా మంది నేత‌ల‌కు రాష్ట్రంలోనూ ప‌ద‌వులు పంచారు. కానీ, ఇప్పుడు పురందేశ్వ‌రికి రాష్ట్ర క‌మిటీలో చోటు ల‌భించ‌లేదు.

అయితే, దీనిపై రెండు ర‌కాల చ‌ర్చ సాగుతోంది. ఒక‌టి సోమును వ్య‌తిరేకించిన గ‌ణంలో పురందేశ్వ‌రి ఉన్నార‌ని… అందుకే ఆయ‌న ఆమెను దూరం పెట్టార‌ని ఒక ప్ర‌చారం సాగుతుండ‌గా, కేంద్రంలో ఏదో ఒక ప‌ద‌విని ఆశిస్తున్న పురందేశ్వ‌రి త‌న‌కు తానుగానే రాష్ట్ర కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నందుకే ఆమెను దూరం పెట్టార‌ని మ‌రో ప్ర‌చారం సాగుతోంది. ఏదేమైనా పురందేశ్వ‌రి కుటుంబం ప్ర‌స్తుతం రాజ‌కీయంగా పెను వ్య‌తిరేక ప‌వ‌నాల‌ను ఎదుర్కొంటున్న స‌మ‌యంలో ఈ ప‌రిణామం మ‌రింత ఇబ్బందిక‌రంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version