త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తారని అన్నారు మాజీమంత్రి, వైఎస్ఆర్సిపి రీజనల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శనివారం రోజు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి కార్యవర్గ సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. వైసీపీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క వైసీపీ నేత, కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలను కొనసాగించిన ఘనత జగన్ కే దక్కుతుందని పేర్కొన్నారు. కరోనా సమయంలో చంద్రబాబు, నారా లోకేష్ హైదరాబాద్ కే పరిమితం అయ్యారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా 46% ఓటింగ్ వచ్చిందని.. పార్టీ భయపడాల్సిన పరిస్థితి లేదన్నారు.
కూటమి ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారని.. ప్రస్తుతం ఏ ఎన్నికలు వచ్చినా కూటమి ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్యకర్తల సమస్యలు ఏవైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని అన్నారు పెద్దిరెడ్డి. కార్యకర్తలు అన్నీ వర్గాలతో కలిసి ఐక్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు.