దేశంలో ఉత్తమ క్రీడా విధానంగా ఏపీ నూతన క్రీడా పాలసీ ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు నాలుగు లక్ష్యాలతో పాలసీకి రూపకల్పన చేయాలని సూచించారు. రాష్ట్రంలో నూతన క్రీడా విధానం పై చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్ విజేతలకు ఇచ్చే ప్రోత్సాహకం భారీగా పెంచాలని నిర్ణయించారు. ఒలింపిక్స్ లో బంగారు పతకం గెలిస్తే.. ఇచ్చే ప్రోత్సాహకం రూ.75లక్షల నుంచి రూ.7కోట్లకు పెంచాలని ఆదేశించారు.
స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో న్యూ క్రీడా పాలసీకి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఏసియన్ గేమ్స్ లో పాల్గొన్న వారికి రూ.10లక్షలు ఇవ్వాలని సూచించారు. వరల్డ్ ఛాంపియన్ షిప్, వరల్డ్ కప్ పోటీలలో బంగారు పతకం సాధించిన వారికి రూ.50లక్షలు, రజతం సాధించిన వారికి రూ.35లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.25లక్షలు ఇవ్వనున్నారు. నేషనల్ గేమ్స్ బంగారు పతకం సాధించిన వారికి రూ.10లక్షలు, రజతం సాధించిన వారికి రూ.5లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.3లక్షలు ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రతిపాదించారు.