రుషికొండకు గుండు కొట్టి 430 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్యాలెస్ లో 33 ఏళ్ల పాటు మకాం వేసేందుకు జగన్ మోహన్ రెడ్డి గారు సరి కొత్త ప్రణాళిక రచించారని ప్రముఖ దినపత్రిక వార్తా కథనాన్ని ప్రచురించిందని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. అయితే ఇదే విషయాన్ని తాను ఐదు, ఆరు నెలల క్రితమే రచ్చబండ కార్యక్రమంలో పేర్కొనడం జరిగిందన్నారు. టూరిజం పేరిట నిర్మిస్తున్న ఈ భవనాలను తన బినామీ ప్రైవేట్ సంస్థకు 33 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు పావులు కదుపుతున్నారని, రేపు ఎన్నికల్లో ఓడిపోయినా ఇబ్బంది లేకుండా ఉండడానికే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
లీజు ఒప్పందానికి అంగీకరించిన అధికారులను, లీజు తీసుకున్న వారిని ఏ ఒక్కరిని వదిలి పెట్టేది లేదని, వారిని ఖచ్చితంగా తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జైలులో వేయిస్తాం అని, అటువంటి పిచ్చి పిచ్చి వేషాలను అధికారులు వేయవద్దని రఘురామకృష్ణ రాజు గారు హెచ్చరించారు. రుషికొండపై నిర్మించిన భవనాలలో జగన్ మోహన్ రెడ్డి గారు మూడు నెలల పాటు కాపురం చేస్తే… చేసుకోనివ్వండని, ఆ తరువాత ఆ భవన సముదాయాన్ని మానసిక చికిత్సాలయంగా మారుస్తామని చెప్పారు. రుషికొండపై జరిగిన ప్రకృతి విధ్వంసాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తే కోర్టు తీర్పు వెల్లడించకుండా రిజర్వులో పెట్టడం వల్ల, ప్రస్తుతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండి పోవాల్సిన పరిస్థితి నెలకొందని రఘురామకృష్ణ రాజు గారు ఆవేదన వ్యక్తం చేశారు.