మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేడు మరోసారి సిబిఐ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయంలో ఆయన మూడోసారి విచారణ కోసం వెళ్లారు. అయితే సిబిఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ గురువారం ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ తీరుపై అనుమానాలు ఉన్నాయని అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోరినా సిబిఐ స్పందించలేదని అవినాష్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఈరోజు హాజరుకావాలని సిబిఐ నోటీసులు ఇచ్చిందన్నారు. గత రెండుసార్లు జరిపిన విచారణ స్టేట్మెంట్స్ ను పక్కన పెట్టాలని అవినాష్ న్యాయవాది కోరారు. సిబిఐ విచారణకు పూర్తిగా సహకరిస్తామన్నారు. దీంతో ఈ కేసుని సోమవారం తమముందు ఉంచాలని సిబిఐ ని ఆదేశించింది హై కోర్ట్.