రేప్ ల్లో బీహార్‌ను ఏపీ మించిపోయిందని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్… పూటకో రేప్ తో బీహారును ఏపీ మించిపోయిందని విమర్శలు చేశారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని.. ఇవాళ ఓ వలసకూలీపై రేపల్లెలో అత్యాచారం జరిగిందన్నారు. బతుకుదెరువు కోసం భర్త, పిల్లలతో వలసవెళ్లిన మహిళపై కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆగ్రహించారు.
రాష్ట్రంలో ఏంచేసినా పోలీసులు ఏమీ చేయలేరనే ధైర్యంతోనే ఉన్మాదులు ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారని.. గత నాలుగు రోజులుగా గుంటూరు జిల్లాలో రోజుకో రేప్ జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిపక్షంపై ఎదురుదాడి మాని మహిళలపై నేరాలను అదుపుచేసేందుకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇలాగే వదిలేస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని మహిళలు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లే భయానక పరిస్థితులు తలెత్తొచ్చని..సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడాలని విమర్శలు చేశారు. హోం మంత్రి తానేటి వనిత ఒక మహిళ అయి ఉండి మహిళల తప్పిదాల వల్లే రేప్ లు జరుగుతున్నాయనే విధంగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. పెంపకంలో తల్లుల తప్పుల వలనే ఘోరాలు జరుగుతున్నాయని కించపరుస్తూ మాట్లాడి.. తప్పించుకునే ప్రయత్నం స్వయంగా హోం మంత్రి చేయడం బాధాకరమని ఫైర్ అయ్యారు నారా లోకేష్.