ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ఎన్నికల కోడ్ కి ముందు అధికార వైసీపీ సిద్ధం సభలను ఏర్పాటు చేస్తే.. ప్రతిపక్ష టీడీపీ రా..కదలిరా అనే సభలను ఏర్పాటు చేసింది. ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత ఈనెల 27న వైసీపీ బస్సు యాత్రలను ప్రారంభించనున్నారు సీఎం జగన్. నిన్న చిలుకలూరి పేటలో టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడి ప్రజాగళం సభ నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆ పార్టీ సీనియర్ నేతలు ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ఆదివారం ‘ప్రజాగళం’ సభ జరిగిన తీరుపై చంద్రబాబు సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కార్యాచరణపై చర్చించారు. ‘ప్రజాగళం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సభలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. పల్నాడులో ప్రధాని మోడీ పాల్గొన్న సభను విఫలం చేయాలని పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారని.. ఈ సందర్భంగా చంద్రబాబు దృష్టికి నేతలు తీసుకెళ్లారు. పోలీసులు ప్రయత్నాలను ప్రజలు తిప్పి కొట్టారని తెలిపారు. అధికార పార్టీ ఒత్తిడితో సభకు పోలీసులు అనేక ఆటంకాలు కలిగించారని విమర్శించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రానున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.