ఏపీలోని నిఘావర్గాలు తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నాయని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లేఖ రాశారు. కొన్ని నెలలుగా తన ఫోన్ నెంబర్లు ట్యాప్ చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. అలాగే ఇది ముమ్మాటికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21ను ఉల్లంఘించడమేనని ఆయన కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా వైఎస్ రెడ్డి అనే పేరుతో తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు.
తన ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలని అజయ్ భల్లాను ఎంపీ రఘురామ కోరారు. కాగా, గతంలో కూడా తనకు భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖకు రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్రం ఆయనకు భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. మరి రఘురామకృష్ణంరాజు చేసిన ఈ సంచలన ఆరోపణల మీద కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.