వ్యవస్థలన్నింటినీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్వనాశనం చేసిందని, వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలేమి చేయలేకపోతున్నారని ఫైర్ అయ్యారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. ప్రజల తరఫున పోరాడుతున్న ఈనాడు సంస్థ అధినేత రామోజీరావుకు కనీసం అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.
ప్రజల కోసమే ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ, టీవీ5 చైర్మన్ రాజగోపాల్ నాయుడు, రామోజీరావు పోరాడుతున్నారని, ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఈనాడు దినపత్రిక ద్వారా ఎత్తిచూపుతోన్న రామోజీరావు గారిపై జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సీఐడీ ద్వారా నేరుగా దాడి చేస్తోందని, ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే, ప్రజల కోసం పోరాడుతున్న రామోజీరావు గారికి ప్రతి ఒక్కరూ మానసికంగా మద్దతును ఇవ్వాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కోరారు.
ఉషోదయ, ఉషా కిరణ్ సంస్థల ఆస్తుల అటాచ్మెంట్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలన్నీ గాలికి వదిలేసిందని, 2014 బ్యాచ్ కు చెందిన జూనియర్ ఐపీఎస్ అధికారి అమిత్ బర్ధార్, పక్కనే ఐజి శ్రీకాంత్ గారు ఉన్నప్పటికీ రెచ్చి పోయారని, ఉషోదయ ఎంటర్ప్రైజెస్, ఉషా కిరణ్ సంస్థల ఆస్తుల అటాచ్మెంట్ కు ప్రభుత్వ అనుమతితో నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. చిట్ ఫండ్ సంస్థ చిట్టీల వ్యాపారమే చేయాలని, ఇతర వ్యాపారాలు చేయవద్దని నిబంధనలు చెబుతున్నాయని, ఈ నిబంధనలను అతిక్రమించిన ఉషోదయ ఎంటర్ప్రైజెస్, ఉషా కిరణ్ సంస్థలకు నోటీసులు ఇచ్చామని అమిత్ బర్దార్ వెల్లడించారని అన్నారు. సీఐడీ నమోదు చేసిన ఈ కేసు కోర్టులో నిలబడదని, ఈ కోర్టులో కాకపోతే పై కోర్టులో కేసు కొట్టివేస్తారన్న రఘురామకృష్ణ రాజు గారు, మార్గదర్శి సంస్థ చిట్ ఫండ్ వ్యాపారం చేస్తుందన్నారు.