లేచిన గ‌ళాలు.. వెల్లువెత్త‌నున్న ఉద్య‌మాలు.. కొత్త జిల్లాల త‌ల‌నొప్పులు స్టార్ట్‌!

-

కొత్త జిల్లాల ఏర్పాటుతో రాజ‌కీయంగా దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌ని వైఎస్సార్ సీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని జిల్లా చేయాల‌ని భావిస్తున్నారు. అయితే, ఇది అనుకున్నంత ఈజీకాదు.. ఎన్ని ప్ల‌స్సులు ఉన్నాయ‌ని ఆయ‌న లెక్క‌లు వేసుకుంటున్నారో.. అన్నేమైన‌స్‌లు ఈ వ్య‌వ‌హారంలో క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే కొన్ని గ‌ళాలు లేచాయి.. మ‌రికొన్నాళ్ల‌లో ఉద్య‌మాల వెల్లువ‌లు మొద‌లు కానున్నాయి. త‌మ‌కూ ఓ కొత్త జిల్లా కావాల‌ని కోరుకునేవారు.. త‌మ‌ను ప‌క్క‌నున్న పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో క‌ల‌వ‌ద్ద‌ని డిమాండ్ చేసేవారు పెరుగుతున్నారు. మొత్తంగా ఈ సెగ సీఎం జ‌గ‌న్‌కు, ఆయ‌న పార్టీకి బాగానే త‌గ‌ల‌నుంద‌నే విశ్లేష‌ణ‌లు తెర‌మీదికి రావ‌డం గ‌మ‌నార్హం.


కొత్త జిల్లాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ‘ఆదోని’ తెరపైకి వస్తోంది. కర్నూలు జిల్లాను… కర్నూలు, నంద్యాల, ఆదోనిగా విభజించాలన్న వాదన ఇప్పటిది కాదు. లోక్‌సభభ స్థానాలే ప్రాతిపదిక అయితే… కొత్తగా నంద్యాల జిల్లా ఏర్పడుతుంది. అయితే, ఆదోని రెవెన్యూ డివిజన్‌లో ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి. రాయలసీమలోనే అతిపెద్ద మార్కెట్‌ యార్డు ఇక్కడే ఉంది. విస్తీర్ణత, ప్రాధాన్యం దృష్ట్యా ఆదోనిని ప్రత్యేక జిల్లా చేయాల్సిన అవసరముందనేది ఇక్కడి నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధుల అభిప్రాయం. లేకపోతే… తమను కర్ణాటకలో కలపాలని, అప్పుడు సాగునీటి వివాదాలు పరిష్కారమవుతాయని వాదించేవారూ ఉన్నారు. ఈ విష‌యం జ‌గ‌న్ ప్రాణ‌సంక‌టంగా మార‌నుంది.

ఇక‌, గుంటూరు జిల్లాలో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న ప్రాంతం… పల్నాడు. దీనికి ప్రధాన కేంద్రం గురజాల! చారిత్రక నేపథ్యం, రాజకీయ చైతన్యం ఉన్న గురజాలను జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్‌ దశాబ్దాలుగా వినిపిస్తోంది. ఇప్పుడు అది మరింత ఊపందుకుంది. దాదాపు అన్ని పార్టీల వారు ఈ డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నారు. గురజాల జిల్లాతో వెనుకబడిన పల్నాడు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. కానీ, జ‌గ‌న్ లెక్క‌ల ప్ర‌కారం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా  కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే.. ఇది న‌ర‌స‌రావుపేట జిల్లా ప‌రిధిలోకి వ‌స్తుంది. కానీ, దీనికి ఇక్క‌డి ప్ర‌జ‌లు ఒప్పుకోవ‌డం లేదు. దీంతో రానున్న రోజుల్లో ఇది స‌మ‌స్య‌గా మారుతుంద‌నడంలో సందేహం లేదు.

అదేవిధంగా.. చిత్తూరు జిల్లాలో ఉన్న మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఊపందుకుంటోంది. ఈ దిశగా ఉద్యమాలూ మొదలయ్యాయి. మదనపల్లె దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌. అది కూడా 220 ఏళ్ల కిందటే ఏర్పడింది. కానీ… ఇది కడప జిల్లా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉంది. కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే… తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు సెగ్మెంట్లతో కలసి మదనపల్లె సెగ్మెంటు కూడా రాజంపేట పరిధిలోకి వెళుతుంది. రాజంపేటకంటే 40 ఏళ్ల ముందే మదనపల్లె మునిసిపాలిటీగా అవతరించింది.

జనాభా కూడా రాజంపేటకంటే ఎక్కువే. వీటిని పరిగణనలోకి తీసుకుని మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇలా చాలా చోట్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌తో సంబంధం లేకుండా త‌మ‌కంటూ ప్ర‌త్యేక జిల్లాల ఏర్పాటు చేయాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు. ఇవి రానున్న రోజుల్లో సీఎం జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పులుగా మారే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version