ఏపీలో ట్రాఫిక్ ఉల్లంఘనలకి భారీగా ఛార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అన్నేసి వేలు ఎలా కట్టాలని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశం మీద ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు. ఏపీలో ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే భారీగా ఫైన్ లు వేయాలని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు, టీడీపీ అనుకూలంగా పనిచేస్తున్న మీడియా దుమ్మెత్తు పోస్తుందని అన్నారు. కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారన్న ఆయన ఇష్టారీతిన వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోకూడదా ? అని ప్రశ్నించారు.
అలానే భరత్ అనే సినిమా చూసి చప్పట్లు కొడతారు.. అలా చేస్తే జగన్ ని విమర్శిస్తారా ? అని ఆయన ప్రశ్నించారు. ఫిట్ నెస్ లేని వాహనాలను, అడ్డగోలు గా వాహనాలు నడిపే వారి ని వదిలేయాలా ? అని ఆయన ఫైర్ అయ్యారు. ముందు గోతులు పూడ్చండి తర్వాత ఫైన్ లు వేయాలని ఫేస్ బుక్ లో కామెంట్స్ చేస్తున్నారని, భారీ వర్షాల వల్ల రోడ్లు డామేజ్ అయ్యాయి.. గుంతలు పడితే వాహనాలను ఇష్టమొచ్చినట్టు నడిపించొచ్చా అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం మోటర్ వెహికిల్ యాక్ట్ లో 31 సవరణలు చేసిందని, దాంట్లో 20 సెక్షన్స్ అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందేనని అన్నారు. మిగతా 11 సెక్షన్స్ లో రాష్ట్రాలకు వెసులుబాటు ఇచ్చిందని అయన అన్నారు.