రోడ్లపై సభలు, ర్యాలీలకు అనుమతి లేదని వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేశాక..టీడీపీ అధినేత చందబాబు కుప్పం పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే వారం రోజుల కిందటే బాబు కుప్పం టూర్ ఫిక్స్ అయింది. అయితే కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించడంతో రోడ్లపై సభలు, ర్యాలీలు పెట్టుకోవడానికి లేదని ప్రభుత్వం జీవో ఇచ్చింది..పోలీసులు అనుమతించిన ప్రదేశాల్లో సభలు పెట్టుకోవాలని సూచించింది.
ఈ జీవో నేపథ్యంలో బాబు కుప్పం పర్యటనకు వచ్చారు. దీంతో అక్కడ పోలీసులు టీడీపే కార్యక్రమాలకు బ్రేకులు వేస్తున్నారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే టీడీపీ ప్రచార రథం, సౌండ్ వాహనం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్లు, సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు . కెనామాకులపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన స్టేజ్‌ను కూడా పోలీసులు తొలగించారు. అయితే ఈ రచ్చబండ కార్యక్రమానికి ముందు పోలీసులు అనుమతించారని, కానీ ఇప్పుడు అనుమతి లేదని చెప్పడం దారుణమని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
ఇక ఎక్కడకక్కడ టీడీపీ శ్రేణులని రోడ్లపైకి రాకుండా పోలీసులు నిలువరిస్తున్నారు. ఇలా పోలీసులు భారీగా మోహరించడంతో కుప్పంలో హైటెన్షన్ నెలకొంది. కానీ తాజాగా జీవో వచ్చాక..జగన్ రాజమండ్రిలో రోడ్ షో నిర్వహించడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. రూల్స్ అధికారంలో ఉన్న వారికి లేవా? అని ప్రశ్నిస్తున్నారు.
అయితే రోడ్ షో కాకపోయినా..ఖాళీ ప్రదేశాల్లో సభలకు అనుమతిస్తామని జీవోలో ఉందని, కానీ ఇప్పుడు రచ్చబండ పెట్టుకుంటే అడ్డుకుంటున్నారని అంటున్నారు. ఇక బాబు కుప్పం టూర్ సజావుగా సాగేలా కనిపించడం లేదు. మరి పోలీసుల ఆంక్షలతో బాబు టూరుకు బ్రేకులు పడతాయేమో చూడాలి.