నరసాపురం ఎంపీ కే రఘురామకృష్ణం రాజు మళ్లీ పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత రెబల్‌గా మారారు. కొన్ని సంవత్సరాల పాటు రెబల్‌గా మారి ఆ పార్టీపైనే తీవ్రమైన విమర్శలు చేశారు. ఇటీవలే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. తాను ప్రతిపక్ష శిబిరం నుంచి మళ్లీ నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు చాలా కాలం సస్పెన్స్‌లో ఉండింది. ఇటీవలే టీడీపీని ఎన్డీయేలోకి చేర్చుకుంటున్నట్టు బీజేపీ ప్రకటించింది. ఇంకా సీట్లపై, అభ్యర్థులపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే.. రఘురామ పోటీ పై మాత్రం దాదాపు స్పష్టత వచ్చిందనే చెబుతున్నారు.
బీజేపీకి ఆరు సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు, పవన్ అంగీకరించారు. ఆ సీట్ల సర్దుబాటు సమయంలోనూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నరసాపురం లోక్ సభ సీటుపై స్పష్టంగా బీజేపీతో మాట్లాడినట్టు తెలిసింది. నరసాపురం నుంచి రఘురామ పోటీ చేస్తాడని, ఒక వేళ ఆ సీటు బీజేపీ కావాలనుకుంటే.. అక్కడి నుంచి రఘురామనే బరిలోకి దింపాలని, అలాగైతేనే.. ఆ స్థానం తీసుకోవాలని చంద్రబాబు నాయుడు బీజేపీ హైకమాండ్‌కు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయానికి మద్దతు చెప్పారు. దీంతో బీజేపీ నరసాపురం సీటుకు బదులు ఏలూరు సీటు వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.