వైకాపా నుంచి తనను సస్పెండ్ చేసి ఉంటే ఆ పార్టీ సభ్యుడిని కాదని, సాధారణ ఎంపీనని మాత్రమే పేర్కొని ఉండేవాడినని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ ఆయాచిత లబ్ధి పొందడమే కాకుండా, తన వందిమాగాదులకు లబ్ధిని చేకూర్చారని తాను దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలను వినిపించారన్నారు.
రఘురామకృష్ణ రాజుని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ, 2020లోనే స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్న శ్రీరామ్ గారు, దాని గురించి ప్రజా ప్రయోజనాల వాజ్యం (పిల్ )లో ప్రస్తావించకపోవడం సమంజసం కాదన్నారని వెల్లడించారు. అదే పాయింట్ పై ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్ ) కొట్టివేయాలన్నారని, తనపై దాఖలు చేసిన డిస్ క్వాలిఫికేషన్ పిటిషన్ గురించి చెప్పలేదనడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.
తాను జగన్ మోహన్ రెడ్డి గారిపై ఒక పిటిషన్ దాఖలు చేసి, ఆయన్ని దొంగ అని అనలేను కదా? అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణ రాజు గారు షెడ్యూల్ 10 ఉల్లంఘించానని పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని పక్కన పడేశారన్నారు. తనను పిలిస్తే తన స్టేట్మెంట్ ఇచ్చానని, ఈ వ్యవహారమంతా జరిగి కూడా రెండేళ్లు అవుతోందని, పక్కన పడేశారు అంటే ఉపయోగం లేదనే కదా… చెల్లదనే కదా అర్థం అని ఆయన ఎదురు ప్రశ్నించారు.