చంద్రబాబుపై దాడితో..జగన్ ప్రభుత్వం కూలబోతుంది – రఘురామ

-

అనపర్తి అరాచక ఘటనతో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి శుభం కార్డు పడినట్టు సుస్పష్టమైందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. మొన్నటి వరకు తమ పార్టీ పాతిక సీట్లలో విజయం సాధిస్తుందని అనుకున్నామని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా కష్టమే అనిపిస్తోందన్నారు. అనపర్తిలో పోలీసులు ఒక రకంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిపై దాడి చేసినంత పని చేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు, సకల శాఖా మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి గారు, పోలీసుల అఘాయిత్యాలను నిచ్చెన మెట్లుగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్లారని కొనియాడారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రజలంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.

శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణ రాజు గారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఇది ఒక పార్టీకి వచ్చిన సమస్య కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థకు వచ్చిన ముప్పని పేర్కొన్నారు. దీనిపై ప్రజాస్వామ్య వాదులంతా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. అనపర్తి ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు గారు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు స్పందించిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుతో సహా ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా స్పందించాలని సూచించారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ సమావేశాలను నిర్వహిస్తోందని, రేపు ఎవరైనా ఆ పార్టీ పెద్ద నాయకులు హాజరైనప్పుడు జనం అధికంగా వస్తే వారికి కూడా ఇదే సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు.

 

ఎవరికి వారు మనకెందుకులే అనుకుంటే రేపు మనకూ ఇటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. తనపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసి లాకప్ లో చిత్రహింసలకు గురిచేసి, అది చూసి జగన్ మెహన్ రెడ్డి గారు ఆనందించినప్పుడే రాష్ట్రంలో ప్రభుత్వ అరాచకం మొదలయ్యిందన్నారు. తనని లాకప్ లో చిత్ర హింసలు పెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు స్పందించి… ఒక ఎంపీకే రక్షణ లేకపోతే, రేపు సామాన్యుల పరిస్థితి ఏమిటని?, ప్రజాస్వామ్యానికి జరగనున్న ప్రమాదాన్ని ముందే గ్రహించి ప్రతీ ఒక్కరూ స్పందించాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్న రోడ్ షోలకు అనూహ్య ప్రజాదరణ లభిస్తుండడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం చీకటి జీవో నెంబర్ 1 తీసుకువచ్చిందని విమర్శించారు. అనపర్తిలో రోడ్డుపై పోలీసులు బైఠాయించి లారీలు ట్రాక్టర్లను అడ్డుపెట్టి చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ ని అడ్డుకోవాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని మచ్చ అని ఆందోళన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version