పొగమంచు ఎఫెక్ట్.. విశాఖలో ఒకదానికొకటి ఢీకొన్న ఐదు వాహనాలు

-

దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు చలికి గజగజ వణుకుతున్నాయి. ఉదయం 10 గంటలైనా పొగమంచు కప్పేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. పొగ మంచు కారణంగా చాలా చోట్ల ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇవాళ ఏపీలోని విశాఖ కొమ్మాది కూడలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి.

ఆర్టీసీ బస్సు, గ్యాస్ ట్యాంకర్‌, మూడు కార్లు వరుసగా ఢీ కొన్నాయి. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా కొమ్మాది కూడలిలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

వారం రోజులుగా ఉత్తరాంధ్రాను పొగమంచు కప్పేస్తుండటం వల్ల రోడ్లపై ఎదురుగా వెళ్లే వాహనాలు, వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. రోడ్లపై దట్టమైన పొగమంచు కమ్మేసి ఉండటంతో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version