రుషికొండ బాత్రూం వీడియోలు వైరల్ కావడంతో..ఘాటుగా స్పందించింది వైసీపీ. రుషికొండ మీద రూ.500 కోట్లతో జగన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్‌లోని రూ.26 లక్షల బాత్ టబ్ ఇదే అంటూ కొన్ని ఫోటోలు వైరల్ చేసింది టీడీపీ. అయితే.. టీడీపీకి వైసీపీ కౌంటర్ ఇచ్చింది. రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతంకూడా కాదని పేర్కొంది.
విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నాడని వివరించారు.
ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్‌లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి. రుషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగాని, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదని తెలిపింది వైసీపీ.