సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీ సీఎం జగన్‌కు రాజకీయ సలహారుగా ఉన్న సాక్షి పత్రిక మాజీ ఎడిటోరియల్ డైరెక్టర్. గతంలో ఆయన సాక్షిలో ఉన్నప్పుడు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా(అదికాంగ్రెస్ లేదా టీడీపీ ప్రభుత్వం) వార్తలు రాయాల్సి వచ్చినప్పుడు.. తప్పు మీదగ్గర పెట్టుకున్నారు కాబట్టే.. మేం రాశాం! అంటూ సమర్ధించుకున్న మేధావి. ఒకానొక సందర్భంలో ఇదే విషయాన్ని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఉతికి ఆరేశారనుకోండి! అలాంటి ఘటం.. ఇప్పుడు సీఎం జగన్ దగ్గర సలహాదారుగా ఉన్నారు. ఆయనే ఇప్పుడు కొన్ని సూక్తులు చెప్పుకొచ్చారు.
అది కూడా ఏ ప్రతిపక్షానికో.. ఏచంద్రబాబుకో అయితే.. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏముంటుంది. నిత్యం ఇవి మామూలే అని అందరూ సరిపెట్టుకునేవారు. కానీ, సొంత పార్టీ నేతలపైనే సజ్జల వారు తన అమ్ముల పొదిలో పాతబడిన సూక్తులకు కొత్త మెరుగులు దిద్ది వదిలారు. ఇటీవల కాలంలో వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూల వరకుకూడా ఫైర్ అవుతున్నారు. వీరిలో సీనియర్ మోస్ట్ ఆనం కూడా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందని అందరూ అనుకున్నారు.
కానీ, తాజాగా మీడియా ముందుకు వచ్చిన సజ్జల వారు.. తప్పుతమది కాదని(అంటే .. జగన్, ప్రభుత్వం).. అంతా ప్రజాప్రతినిధులదేనని చెప్పి చేతులు దులుపుకొన్నారు. ఆయనేమన్నారంటే.. సమస్యలేమైనా ఉంటే వారు అధికారులకు తెలియజేయడమనేది సహజంగా జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు. సందర్భానుసారంగా అవసరమైతే అధికారులను ప్రజల పక్షాన నిలదీస్తారని చెప్పారు. దీన్నే అసంతృప్తిగా భావించాల్సిన అవసరం లేదని నొక్కి వక్కాణించేశారు. పనిలో పనిగా.. ప్రభుత్వంపై పొగడ్తలు కురిపించారు.
దేశంలోనే ఆన్‌లైన్ విధానంలో ఇసుకను సులభంగా వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు ఉందన్నారు. కొత్త విధానం ద్వారా ఇసుకను అందిస్తున్న క్రమంలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని ఆయన తెలిపారు.
మొత్తంగా సజ్జల వారి సూక్తుల్లో ఎన్నదగిన విషయం ఏంటంటే.. ఆట్టే నోరు పారేసుకోకుండా.. అధికారులను నిలదీయాలనే!! కానీ, ఆ అధికారులు వేరే వారు చెబుతున్నట్టు తోకఝాడిస్తున్నారనేదే కదా.. అయినవారి ఇలాకాలో ప్రజాప్రతినిధుల ఆవేదన! కానీ… టాఠ్.. ఇది కూడా ప్రతిపక్షం కుట్ర అనేలా ఉన్నారు సజ్జల. మరి సూక్తులు ఏమేరకు పనిచేస్తాయో చూడాలి.