ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కరోనా నేపథ్యంలో క్రికెట్‌లో పలు కొత్త నిబంధనలు చేర్చింది. భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఓ కమిటీ చెప్పిన సూచనల మేరకు ఐసీసీ పలు క్రికెట్ రూల్స్‌ను కొత్తగా ప్రవేశపెట్టింది. కరోనా నేపథ్యంలో ఈ రూల్స్‌ను ప్రవేశపెట్టినట్లు ఐసీసీ తెలియజేసింది. ఇక ఆ రూల్స్ ఇలా ఉన్నాయి.
* టెస్టు మ్యాచ్‌లు ఆడే సమయంలో ప్లేయర్లకు కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని మార్చుకునే విధంగా అదనపు ప్లేయర్లకు జట్లు అవకాశం కల్పించాలి.
* ప్లేయర్లను టీంలో మార్చాల్సి వస్తే రిఫరీని సంప్రదించాలి. రిఫరీ అనుమతి ఇచ్చాక జట్లు ఒక ప్లేయర్‌కు బదులుగా మరొక ప్లేయర్‌ను టీంలోకి తెచ్చుకోవచ్చు.
* వన్డేలు, టీ20 మ్యాచ్‌లలో ప్లేయర్లను పైన తెలిపిన విధంగా మార్చుకునేందుకు అవకాశం లేదు.
* బంతికి ఉమ్మి రాయడాన్ని పూర్తిగా నిషేధించారు. ప్లేయర్లు బంతికి మెరుపు తెప్పించేందుకు ఎట్టి పరిస్థితిలోనూ ఉమ్మి వాడరాదు. ఆరంభంలో అలవాటులో పొరపాటుగా ఎవరైనా బౌలర్ బంతికి ఉమ్మి రాస్తే హెచ్చరిస్తారు. కానీ పదే పదే అలా చేస్తే ఐసీసీ నియమావళి ప్రకారం చర్యలుంటాయి.
* బంతికి ప్లేయర్ ఉమ్మి రాస్తే ఒక్కో టీంకు ఒక ఇన్నింగ్స్‌కు గరిష్టంగా రెండు సార్లు హెచ్చరికలు చేస్తారు. అయినప్పటికీ వినకపోతే 5 రన్నుల పెనాల్టీ విధిస్తారు. బ్యాటింగ్ సైడ్ ఖాతాలో ఆ 5 పరుగులు చేరుతాయి.
* ప్లేయర్ బంతికి ఉమ్మిరాస్తే దాన్ని ఇతర ప్లేయర్‌కు ఇచ్చే ముందు అంపైర్ దాన్ని బాగా శుభ్రం చేయాలి.
* కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇతర దేశాలకు చెందిన అంపైర్లు మ్యాచ్‌లకు హాజరు కావడం కష్టంగా ఉంటుంది కనుక.. స్థానికంగా ఉండే అంపైర్లనే మ్యాచ్‌లకు వినియోగిస్తారు. వారు ఐసీసీ ఎలైట్ ప్యానెల్, ఇంటర్నేషనల్ ప్యానెల్‌కు చెందిన అంపైర్లు అయి ఉంటారు. అయితే ఇది తాత్కాలికమే. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గితే ఎప్పటిలాగే విదేశీ అంపైర్లను మ్యాచ్‌లకు ఉపయోగించుకుంటారు.
* మ్యాచ్‌లలో తక్కువ అనుభవం కలిగిన అంపైర్లను వినియోగించుకుంటారు కనుక.. జట్లకు ఒక్కో ఇన్నింగ్స్‌కు అదనంగా మరో డీఆర్ఎస్ రివ్యూకు అవకాశం కల్పిస్తారు. దీంతో టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌కు 3, వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌కు 2 డీఆర్ఎస్ రివ్యూలను జట్లు ఉపయోగించుకోవచ్చు.
* మ్యాచ్‌ల సందర్భంగా ప్లేయర్ల మధ్య ఏవైనా గొడవలు లేదా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఇతర ఘటనలు చోటు చేసుకున్నా.. విచారణ చేయాల్సి వస్తే.. ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌కు చెందిన తటస్థ అంపైర్లు, రిఫరీలచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపడతారు. మ్యాచ్ ఆడే ఇరు దేశాలకు చెందిన అంపైర్లు కాకుండా ఇతర దేశాల అంపైర్లను, రిఫరీలను ఈ సేవల కోసం రిమోట్‌గా ఉపయోగించుకుంటారు.