పోలవరం ప్రాజెక్టుపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం విధ్వంసానికి బీజేపీ, టీడీపీ, వైసీపీ పార్టీలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ పంతాలు, పట్టింపులకు పోయి ప్రాజెక్టును నీరుగారుస్తున్నారు. పోలవరం ద్వారా 28 లక్షల ఎకరాలకు సాగునీరందించడమే వైఎస్ ఆశయం. విభజన చట్టంలో పోలవరానికి కాంగ్రెస్ జాతీయ హోదా ఇస్తే.. మోదీ సర్కార్ నిధులివ్వకుండా మోసం చేస్తుంది. పోలవరంపై కేంద్రానికి సవతితల్లి ప్రేమ. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును తానే కడతానని.. చంద్రబాబు హడావిడి చేశారు.
గత టీడీపీ ప్రభుత్వంలో పోలవరానికి చంద్రబాబు చేసింది శూన్యం. రివర్స్ టెండరింగ్ పేరిట జగన్ అంచనా వ్యయం పెంచారే తప్ప.. పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. రూ.10 వేల కోట్ల ఖర్చయ్యే ప్రాజెక్టును రూ.76వేల కోట్లకు తీసుకెళ్లారు. ప్రాజెక్టు పూర్తికి చంద్రబాబు మరో ఐదేళ్లు పడుతుందని చెప్పడం సరికాదు. కేంద్రాన్ని శాసించే అధికారం చంద్రబాబు దగ్గర ఉంది. పూర్తిస్థాయి నిధులు తెచ్చి పోలవరం పూర్తి చేయాలని’ షర్మిల డిమాండ్ చేశారు.