అమలాపురం పార్లమెంట్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు కరోనా నుంచి కాపాడుకోవడానికి వెబ్ సైట్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. కరోనా సోకకుండా ఉండేందుకు ఏం చేయాలి..? వ్యాధి నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలి..? వైరస్ సోకితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? వీటన్నింటికి సంబంధించిన వివరాలు వెబ్ సైట్ లో పొందుపరుస్తామని అయన పేర్కొన్నారు. స్పెషలిస్టులు, మేథావులు, డాక్టర్లు కూడా ఈ వెబ్ సైట్ ద్వారా అందుబాటులో ఉంటారని ఆయన అన్నారు.
ఇక ఏపీ ప్రభుత్వ తీరు గురించి మాట్లాడుతూ లా అండ్ అర్డర్ ఎక్కడ తప్పినా కోర్టులు కలుగజేసుకుంటాయని హైకోర్టు స్పష్టం చేసిందని, కానీ కోర్టులపైనే ఇష్టానుసారంగా జగన్ వర్గం వ్యాఖ్యలు చేస్తుందని అన్నారు. పులివెందుల రాజ్యాంగాన్ని జగన్ అమలు చేస్తున్నారన్న ఆయన దేశంలో మహిళలపై ఎక్కువ దాడులు ఏపీలో జరగటం జగన్ రాక్షస పాలనకు అద్దం పడుతుందని అన్నారు. కరోనా పోయిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజలందరిని కలిసి కష్టాలను తీర్చేందుకు నడుం బిగిస్తానని అన్నారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారు ఎవ్వరైనా సరే భవిష్యత్ లో తగిన గుణపాఠం చెబుతామని ఆయన అన్నారు. పార్టీ కమిటీల్లో యువతకు పెద్ద పీట వేస్తున్నామని, కొత్త రక్తాన్ని పార్టీకి ఎక్కించాల్సిన అవసరం ఉందని అన్నారు.