అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల కలకలం రేపుతోంది. దీంతో రాష్ట్రంలోని ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. అబూబకార్ సిద్ధికీ, మహమ్మద్ అలీ వస్త్ర వ్యాపారం చేస్తూ 13 సంవత్సరాల నుంచి రాయచోటిలోనే నివాసముంటున్నారు. ఇన్ని సంవత్సరాలు తమ మధ్య ఉన్నవారు ఇద్దరూ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అని తెలియడంతో పట్టణ వాసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న పోలీసులు వారి ఇళ్లలో సోదాలు చేయగా భారీ పేలుడు పదార్థాలు, వాకీటాకీలు లభించాయి. కాగా, తమిళనాడులో జరిగిన పలు పేలుళ్ల కేసులలో వీరి ప్రమేయం ఉందని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం పోలీసులు అబూబకర్ సిద్ధికి, మహమ్మద్ అలీనీ విచారిస్తున్నారు. వారి ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.
వీరిద్దరూ తమిళనాడు రాష్ట్రం నుంచి రాయచోటికి వచ్చి స్థిరపడ్డారు. వీరిద్దరూ తమిళనాడులో వివాహాలు కూడా చేసుకున్నారు. వీరిద్దరూ ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి, ఎలా వచ్చారనే విషయం గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిద్దరికీ ఎవరు సహకరించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.