ఏ నిముషానికి ఏమి జరుగునో.. అనే పాట వినే ఉంటారు.. అచ్చం అలాగే ఉందట.. విజయవాడ టీడీపీ రాజకీయం. కమ్మ సామా జిక ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ నగరంలో రాజకీయాలు కూడా కమ్మగా ఉంటాయని అనుకుంటారు. కానీ, దీనికి భిన్నంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి చెందిన నేతలు తలకోరకంగా ఇక్కడ వ్యవ హరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడ ఎంపీ చుట్టూ కొన్నాళ్లు రాజకీయాలు హల్‌చల్ చేశాయి. ఆయన పార్టీపై చేసిన తిరుగుబావుటా.. తర్వాత సర్దుమణిగిన తీరు తెలిసిందే.
అయితే, ఇప్పుడు మరోసారి సదరు ఎంపీనే కేంద్రంగా రాజకీయాల్లో చర్చలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా టీడీపీ నేతలు చెవిలో చిన్నమాట అంటూ.. ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. పార్టీలో కానీ, పార్టీ పదవుల్లో కానీ.. సదరు ఎంపీకి ప్రాధాన్యం లభించడం లేదు. పార్లమెంటరీ జిల్లా కమిటీల్లో ప్రాధాన్యం లభించలేదు. అదేసమయంలో ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మరో ఎంపీకి మాత్రం ఏకంగా పొలిట్ బ్యూరోలో చోటు కల్పించారు. దీంతో సదరు ఎంపీ ఉడికిపోతున్నారట. మీడియా ముందుకు రాకుండానే ఆయన విమర్శలు సంధిస్తున్నారు. అదేసమయంలో ట్విట్టర్ ఖాతాను దాదాపుమూసేసుకున్నారు.
ఈ నేపథ్యంలో సదరు ఎంపీ.. వచ్చే మూడేళ్లు పార్టీలోనే ఉన్నా.. ఎన్నికల సమయానికి మాత్రం పార్టీలో ఉండే ఛాన్సేలేదని పెద్ద ఎత్తున విజయవాడ తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. తమకు అనుకూలంగా ఉండే మీడియా ప్రతినిధులకు ఇదే విషయా న్ని ఆఫ్‌ది రికార్డుగా చెబుతూ… ఆనందిస్తున్నారు. మా వోడు వెళ్లిపోవడం ఖాయం బ్రదరూ! అంటూ తమ్ముళ్లు చెబుతుండడం.. ప్రాధాన్యం సంతరించుకుంది.
గతంలో చంద్రబాబుపైనా.. కొందరు నేతలపైనా తీవ్ర విమర్శలు చేయడంతో ఆయనను పక్కన పెట్టారని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతానికి ఆయన సైలెంట్ అయ్యారని, కానీ, త్వరలోనే పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు రెడీగా ఉన్నారని చెబుతున్నారు. ఏదేమైనా.. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చనేది అందరికీ తెలిసిందే.