ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎంపీ జివిఎల్ నరసింహారావు చేసిన ఆరోపణలను తప్పు పట్టారు మంత్రి బొత్స సత్యనారాయణ. నేడు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా మాట్లాడిన మాటలన్నీ చంద్రబాబు మాటలేనని అన్నారు. అమిత్ షా చెప్పేవరకు రాష్ట్రంలో అవినీతిపై జివిఎల్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు మంత్రి బొత్స. ప్రధాని మోదీతో మా బంధం ఎలా ఉందో.. అమిత్ షా తోనూ అలాగే ఉంటుందన్నారు.
కేంద్రానికి కచ్చితంగా మా అవసరం ఉంటుందని స్పష్టం చేశారు బొత్స. అన్ని రాష్ట్రాలతో పాటు రెండు వందే భారత్ రైళ్లు తప్ప బిజెపి ఏపీకి ఏమిచ్చింది..? అని ప్రశ్నించారు. 9 సంవత్సరాల తర్వాత రెవెన్యూ లోటు నిధులు ఇచ్చి ఉద్దరించామంటే ఎలా..? అని నిలదీశారు. బిజెపి నేతలు ముందు తమ మచ్చలు చూసుకోవాలని.. ప్రత్యేక హోదాపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. తమ ఎంపీలు కూడా నిత్యం దీనిపై పోరాటం చేస్తున్నారని తెలిపారు బొత్స.