అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ని ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం apskilldevelopmenttruth.com వెబ్ సైట్ ను ప్రారంభించారు టీడీపీ సీనియర్ నేతలు. ఈ కార్యక్రమానికి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల, నిమ్మల రామానాయుడు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టారని అన్నారు.
స్కిల్ డెవలప్మెంటులో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలియాలనే ఉద్దేశ్యంతో వెబ్ సైట్ ఓపెన్ చేశామన్నారు. నవంబర్ 2014 నుంచి జరిగిన అన్ని అంశాలు ఈ వెబ్ సైటులో పొందుపరిచామని తెలిపారు అచ్చెన్నాయుడు. ఏపీ కంటే ముందు చాలా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అమలైందన్నారు. కార్యక్రమం బాగా అమలైందంటూ కేంద్రం అవార్డులు కూడా ఇచ్చిందన్నారు. 2,17,500 మంది యువత ఐదు క్లస్టర్ల ద్వారా ట్రైనింగ్ తీసుకున్నారని.. 65 వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలు వచ్చాయన్నారు.