తిరుప‌తి : రుయాలో దారుణం.. ఆ తండ్రి క‌థ క‌న్నీటికి ఆన‌వాలు

-

దేవుడా ర‌క్షించు అని అర‌వ‌కండి మిమ్మ‌ల్ని ప‌నికిమాలిన మీడియా ప‌ట్టించుకోదు. పోనీ మీరు ఓట్లేసి గెలిపించిన నాయ‌కులకూ  పట్టించుకునే ఓపిక ఉండ‌దు. రాజ‌కీయ రాద్ధాంతం అటుంచి మాట్లాడితే ఓ క‌న్న తండ్రి అత్యంత దీనావ‌స్థ‌లో త‌న బిడ్డ శ‌వాన్ని ఊరికి తీసుకువెళ్లేందుకు ఎంతో సాహ‌సం చేశాడు. 90 కిలోమీట‌ర్లు బైక్ పై ప్రయాణించి త‌న బిడ్డ శ‌వాన్ని ఊరికి చేర్చాడు కానీ అక్క‌డ ఉన్న అంబులెన్సులు మాత్రం మాఫియాలో భాగంగా క‌ద‌ల్లేదు. మేం చెప్పిన విధంగా న‌డుచుకోవాలి మీరు తెచ్చుకున్న అంబులెన్సులకు ఇక్క‌డ చోటే లేదు అని హుకుం జారీ చేశాయి. ఇదీ తిరుప‌తి రుయా ప్రాంగ‌ణంలో నెల‌కొన్న చీక‌టి.. మ‌న నాయ‌కులు దేన్నీ నిలువ‌రించ‌లేరు. ఎందుకంటే ఓట్లు పోతాయేమోన‌న్న భ‌యం కావొచ్చు. మాట్లాడితే చంద్ర‌బాబు నాయుడ్ని తిట్టే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి అక్క‌డ ఉండి ఏం చేస్తున్నార‌ని.. వీరంతా అక్క‌డి స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులే కదా ! నెల‌కు ఓ సారి అయినా ఆ ఆస్ప‌త్రి వైపు క‌న్నెత్తి అయినా చూస్తున్నారా ?

బాధ‌ప‌డ‌కండి ఆ తండ్రిని ఊర‌డించేందుకు మ‌న నాయ‌కులు ఈపాటికి బ‌యలుదేరే ఉంటారు. వాళ్ల కాన్వాయ్ ల‌కు ఏ ఆటంకం ఉండ‌దు. వారి జీవితాల‌కూ ఏ ఆటంకం ఉండదు. భ‌గ‌వంతుడు ఆడే ఆట‌లో మ‌నిషి ఓడిపోతాడు కానీ నాయ‌కులు గెలుస్తున్నారు ఎప్ప‌టిక‌ప్పుడు. ఆ విధంగా భ‌గ‌వంతుడి ఆట‌లో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఎన్నో ఆరోప‌ణ‌లకు కేరాఫ్ గా నిలిచే రుయా లో దారుణం చోటుచేసుకున్నా దేవుడు స్పందించ‌లేదు. మ‌నుషులు చ‌లించ‌లేదు. తోటి వారు స్పందించ‌లేదు.

చావును సైతం క‌రెన్సీ నోట్ల‌తో తూచ‌గ‌ల మ‌నుషులు మన మ‌ధ్యే ఉన్న‌ప్పుడు ఎవ్వ‌రినీ ఇక్క‌డ నిందించ‌కూడ‌దు. ఎవ్వ‌రినీ ఇక్క‌డ ప్ర‌శ్నించ‌కూడదు. చూడండి వైసీపీ మంత్రులు వ‌చ్చేలోగానే స‌మ‌స్య ప‌రిష్కారం అయిపోయి, తిరుప‌తి రుయా ప్రాంగ‌ణంలో అంబులెన్స్ మాఫియా అన్న‌దే లేకుండా పోతుంది. ఆ విధంగా మ‌న వైద్య శాఖ మంత్రి కృషి చేయ‌డం ఖాయం. అందుకు దేశంలోనే చెప్పుకోద‌గ్గ బెస్ట్ పాల‌సీని అమ‌లు చేయ‌డం కూడా ఖాయ‌మే ! ఏదేయితేనేం స్వామి స‌న్నిధి లో జ‌రుగుతున్న పాపాల‌కు నిష్కృతి లేదు.. నివృత్తీ లేదు.  అంతా నారాయ‌ణుడిపై భారం వేద్దాం. ఆయ‌నే స‌ర్వ‌జ‌న ర‌క్ష‌కుడు.. దుష్ట జ‌న శిక్ష‌కుడు కూడా !

మ‌నిషిని చూసి మ‌నిషి భ‌య‌ప‌డ‌డం చిన్న విష‌యం. మ‌నిషిని చూసి మ‌నిషి అస‌హ్యించుకోవ‌డం ఇంకా చిన్న విష‌యం. స్పందించే హృద‌యాలు మ‌న చుట్టూ లేవు. స‌వాళ్లు  ఎన్ని ఉన్నా కూడా మ‌నుషులు ఎవ్వ‌రూ తోటి వారి బాగు కోసం పాటు ప‌డ‌రు.. అవ‌న్నీ పుస్త‌కాల‌కు అందులో ఉన్న క‌వితాత్మ‌క రీతుల‌కే ప‌రిమితం. పరిణితి లేని మ‌నుష‌లు,  చావు ద‌గ్గ‌ర కూడా పైస‌లు పోగేసుకునే మ‌నుషులు ఇప్పుడూ ఉన్నారు.. ఎప్పుడూ ఉంటారు. క‌నుక క‌రోనా మ‌నుషుల‌ను మార్చ‌లేదు. ఇక‌పై మార్చ‌దు కూడా !

బిడ్డ చ‌నిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తండ్రికి మ‌రో శాపం ఎదురైంది. బిడ్డ చ‌నిపోయి ఏమీ చేయ‌లేని ఓ నిస్స‌హాయ స్థితిలో ఉన్న ఆ తండ్రికి మ‌రో స‌వాలు ఎదురయింది. మండుటెండ‌లో త‌న కొడుకు శ‌వంతో 90 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాడా తండ్రి.. అదీ అంబులెన్సులో కాదు బైక్ పై .. రుయా ఆస్ప‌త్రి ఎదుట జ‌రుగుతున్న అంబులెన్స్ మాఫియా కార‌ణంగా రోగి వెంట వ‌చ్చిన అంబులెన్స్ ను కాద‌న్నారు. తాము చెప్పిన అంబులెన్స్ లోనే శ‌వాన్ని త‌ర‌లించాల్సి ఉంటుంద‌ని అక్క‌డి వారు ప‌ట్టుబ‌ట్టారు. ఇక చేసేది లేక ఆ తండ్రి నిస్స‌హాయ స్థితిలో ఉండిపోయాడు. మ‌నుషులు లేరు ఎక్కడ కూడా మృగాలే ఉన్నాయి అని అనేందుకు తార్కాణం ఈ ఘ‌ట‌న.

Read more RELATED
Recommended to you

Exit mobile version