తాను రాజకీయాల్లోకి రావడం తన మిత్రుడు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్కు ఇష్టం లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఒకానొక సమయంలో పార్టీని ఎలా నడపాలో, డబ్బులు ఎక్కడ నుంచి తీసుకురావాలో తెలియక ఇబ్బంది పడుతున్నప్పుడు త్రివిక్రమ్ అండగా నిలిచారని చెప్పారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘పార్టీని ఎలా నడపాలో.. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కాలేదు. అలాంటి సమయంలో వెన్నంటే ఉన్న నా స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను సమాజం కోసం ఆలోచిస్తే నాకోసం ఆలోచించేవారు ఒకరు ఉండాలి కదా. ‘వకీల్‌సాబ్’తోపాటు మరో మూడు, నాలుగు సినిమాలు చేశాం. నేను రాజకీయాల్లోకి రావడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. టీనేజ్‌లో ఉద్యమంలోకి వెళ్లిపోవాలనుకున్నా.. కుదరలేదు. సమాజం పట్ల మనసులో ఎంతో కోపం ఉండిపోయింది. నా వ్యధ చూసిన ఆయన.. ఆ బాధనంతా సినిమాలో మాటలుగా రాసేస్తే రాజకీయాల్లోకి వెళ్లనని భావించి ‘జల్సా’లో ఇంటర్వెల్ సీన్ రాశారు. నా ఆవేశం చూసి.. చివరకు ఆయన చేతులెత్తేశారు. మీ ఇష్టం వచ్చింది చేయండన్నారు’’ అని పవన్‌కల్యాణ్ వివరించారు.