టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఏకాంతంగా భేటీ అయ్యారు. గురువారం యువగళం పాదయాత్ర విరామ సమయంలో లోకేష్ తో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఈ భేటీ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. ఇటీవలే యువగళం పాదయాత్రలో వంగవీటి రాధా వరుసగా పాల్గొంటున్నారు. కాగా రాధా లోకేష్ భేటీ పై రాజకీయ వర్గాలలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాపులపాడు మండలం, రంగన్నగూడెంలో నారా లోకేష్ పాదయాత్రలో కొద్దిసేపు హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.
లోకేష్ పాదయాత్రలో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వైసీపీ బ్యానర్ ఏర్పాటు చేసింది. బ్యానర్ పై వైసీపీ హయాంలో రెండు కోట్ల రూ.71లక్షలతో వసూలు చేసిన వివరాలను వైసీపీ కార్యకర్తలు పొందుపరిచారు. వైసీపీ నాయకులతో ఫొటో వేయడాన్ని టీడీపీ శ్రేణులు తప్పు పట్టాయి. బాపులపాడు మండలం రంగన్నగూడెంలో కొడాలి నాని.. వల్లభనేని వంశీ ఫొటోలతో బ్యానర్లు ఏర్పాటు చేశారు. లోకేష్ పాదయాత్ర రంగన్నగూడెం వద్దకు రాగానే బ్యానర్ వద్ద నిలబడి టీడీపీ నేతలను వైసీపీ శ్రేణులు కవ్వించాయి.
వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య కొద్దిసేపు తోపులాట, వాగ్వాదం జరిగింది. టీడీపీ శ్రేణులు తిరగబడటంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు సైతం వైసీపీ కవ్వింపు చర్యలు అన్నీ నియంత్రించలేదు. ఈ నేపథ్యంలోనే ఫ్లెక్సీని తొలగించాలంటూ పోలీసులతో దేవినేని ఉమా వాగ్వాదానికి దిగారు. వైసీపీ శ్రేణులకు పోలీసులు మద్దతుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ మండిపడింది. వైసీపీ నేతల భద్రత కోసం భారీగా పోలీసులను మొహరించారంటూ టీడీపీ ఆరోపణలు చేసింది. చివరికీ ఫ్లెక్సీని తొలగించడంతో వివాదం సద్దుమనిగింది.