వివేకా హత్య కేసు.. బెయిల్ పొడిగించాలని కోర్టును ఆశ్రయించిన వైఎస్ భాస్కర్‌రెడ్డి

-

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, కడప  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తన బెయిల్‌ను పొడిగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన ఎస్కార్ట్ బెయిల్‌ను పొడిగించాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను కంటికి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో విశ్రాంతి అవసరమని ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. వైద్యుల సూచనలు, తదుపరి చికిత్సల దృష్ట్యా మరో రెండు నెలల పాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

అయితే ఈ పిటిషన్‌పై ఈ నెల 3వ తేదీన విచారణ చేపట్టనున్నట్టుగా కోర్టు తెలిపింది. ఇక, వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టు ఇటీవల షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. చంచల్‌గూడ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ అందించిన వైద్య నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 3 వరకు భాస్కర్ రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. బెయిల్ వ్యవధిలో భాస్కర్ రెడ్డి హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది. భాస్కర్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లే సమయంలో అతడికి ఎస్కార్ట్‌గా ఉండేందుకు ముగ్గురు కానిస్టేబుళ్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లను కేటాయించాలని చంచల్‌గూడ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది.

 

జైలు సూపరింటెండెంట్ అందించే ఎస్కార్ట్ సిబ్బందికి రవాణా, వసతి ఖర్చులను భాస్కర్ రెడ్డి భరించాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశాల మేరకు అక్టోబరు 3వ తేదీ ఉదయం 10.30 గంటలకు వైద్యం పూర్తి చేసుకుని జైలు సూపరింటెండెంట్ ఎదుట భాస్కర్ రెడ్డి లొంగిపోవాల్సి ఉంది. ఈ క్రమంలోనే తన ఎస్కార్ట్ బెయిల్‌ను పొడిగించాలని భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టును ఆశ్రయించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version