ఆంధ్రప్రదేశ్ త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. తాజాగా తిరుచానూర్ లో ఇంటింటికి పైపులైన్ ద్వారా గ్యాస్ పంపిణీ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. భవిష్యత్ లో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తామన్నారు. గ్రీన్ ఎనర్జీ వల్ల అనేక ఉపయోగాలున్నాయని.. 99లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు.
మన రాష్ట్రానికి పుష్కలంగా సహజ వనరులున్నాయి. హైవేలు, సముద్రతీరం, పోర్టులు, విమానాశ్రయాలు ఉన్నాయి. ఇంటింటికి గ్యాస్ సరఫరాకు 2014-19 మధ్య ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. దాదాపు 99 లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రతీ ఇంటికి పైపు లైన్ ద్వారా స్వచ్ఛమైన గ్యాస్ అందిస్తామని తెలిపారు. ఇంటింటికి గ్యాస్ అందించేందుకు 5 కంపెనీలను సంప్రదించినట్టు తెలిపారు సీఎం చంద్రబాబు.